AMARAVATHIAndhra Pradesh
అధికారంలోకి వస్తే మేము చేసేదిదే : పవన్ కల్యాణ్

అధికారంలోకి వస్తే మేము చేసేదిదే : పవన్ కల్యాణ్
క్యాపిటల్ వాయిస్ (కృష్ణాజిల్లా) విజయవాడ :- ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకానికి సిఎం జగన్ తనపేరు లేదంటే తన కుటుంబ సభ్యులు పేర్లు పెట్టుకుంటున్నాడని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆరోపించారు.దేశం, రాష్ట్రం కోసం పోరాడిన మహనీయులు మీకు గుర్తుకు రాలేదా? ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, పింగళి వంటి తెలుగు మహనీయుల పేర్లు ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించారు.జనసేన అధికారంలోకి రాగానే అన్ని పథకాలకు జాతీయ నాయకుల పేర్లే పెడతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఆదివారం ఉదయం 9 గంటలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, పి.ఏ.సి. సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జెండా ఆవిష్కరణ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పరాయి దేశ పాలకుల ను తరిమి కొట్టేందుకు ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. అలాంటి మహనీయుల్లో ఒకరు, మువ్వెన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య చివరి రోజుల్లో దుర్భరమైన జీవితం అనుభవించారని అన్నారు. జనసేన ఆవిర్భావానికి ప్రేరణ ఇటువంటి సంఘటనలే అన్నారు. నాడు ఆస్తులు వదులుకుంటే… నేటి రాజకీయ నాయకులు ఆస్తులు దోచుకుని కూడేసుకుంటున్నారని మండిపడ్డారు.నాటి త్యాగాలు, ఉద్యమ స్పూర్తి నేటి తరంలో రావాలి. రెండు వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే విధానం, ఓటు అమ్మకునే విధానం మారాలి. ప్రపంచ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది. కానీ మనదేశానికి వారు సేవలు అందించలేకపోతున్నారు. ఇందుకు మన రాజకీయ నాయకులే ప్రధాన కారణం అన్నారు.రాజకీయ నాయకులంటే పేకాట క్లబ్బులు నడిపే వారు కాదు. సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లు కొల్లగొట్టే వారు నాయకులు కాదు. కొత్త తరం నాయకులు, కొత్త రాజకీయం రావాలి. నేను వృద్దుడిగా అయ్యే లోపు రాజకీయ మార్పు వస్తుందని ఆశిస్తున్నానన్నారు. పవన్.తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే భయం ఉండాలి. ప్రజలు కూడా తమ ఆలోచనల తీరు మార్చుకోవాలి. ఓటువేసే ముందు సామాజిక ప్రయోజనాలు కావాలా వ్యక్తిగత ప్రయోజనం కావాలా అనేది ఆలోచించాలి. ప్రజల్లో ఈ ఆలోచన వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందన్నారు.నేడు ఒక కులం మీద పాలకులు కక్ష కట్టి వేధిస్తే రేపు వాళ్లు అధికారంలోకి వస్తే మరో కులం పై కక్ష కట్టే ప్రమాదం ఉంది. కులాల మధ్య అసమానతలు పోయి మనమంతా భారతీయులుగా ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు.