అద్బుతాల లోయ…బైరవకొన లయల హోయ !

అద్బుతాల లోయ…బైరవకొన లయల హోయ !
క్యాపిటల్ వాయిస్, స్పెషల్ న్యూస్ :- ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం అంబవరం, కొత్తపల్లి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రకాశం-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో తూర్పు కనుమల మధ్య ఒక లోయలో భైరవకోన క్షేత్రం ఉంది. పక్షుల కిల కిల రావాలు…. చల్లనిపిల్ల గాలులు…. ఆకాశన్నంటే చెట్లు… కొండ శిఖరాలనుండి ప్రవహించే జలపాతం.. మళ్ళీ మళ్ళీ చూడాలనే తపన….ఎప్పుడు అక్కడే ఉండాలనే సం ఘర్షణల మధ్య భక్తులు పులకించిపోతారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు బైరవకోనలోని చెట్లు, రాళ్లు, రప్పలు పులకించిపోతాయి. కొండలు కొనలు, శివోహం.. శివోహం … అంటూ జనఘోషతో మారుమోగుతాయి. వీచే చల్లని గాలులు భక్తులకు ఎక్కడ లేని ఉల్లాశాన్ని, ఉత్సహాన్నిస్తాయి. వాటర్ ఫాల్స్ చూపు ప్రక్కకు తిప్పనివ్వదు. సజీవ కళతో ఉట్టి పడే విగ్రహాలు జీవకోటిని మంత్ర ముగ్ధులను చేస్తాయి.. రాచరికపు చిహ్నలకు ప్రతీకగా, ప్రకృతి సోయగాలతో అడుగడుగునా భక్తి భావవర్ణింతంగా కొండల నడుమ కొలువు తీరిన బైరవ కోన ఆహ్లాధాకరమైన వాతావరణాన్ని అందించి దయనందిన వత్తిడి నుండి సేద తీర్చే స్థలాల్లో ఈ ప్రాంతం పేరు గాంచింది. చూస్తుండగానే వెండి మేఘాలు నేలను తాకుతున్నట్లు అనిపిస్తాయి. వేసవి లో సైతం పరిసర ప్రాంతమంతా పచ్చదనంతో పరుచుకొని ఉంటుంది. కొండల నుండి ప్రవహించే గంగా జలం, పక్షుల కిలకిల రావాలు, ఆకాషాన్నంటే చెట్లు భక్తులకు స్వాగతం పలుకుతాయి. కొండ వాగులు తుంపరులుగా, పన్నీరు సువాసనలు వెదజల్లుతూ శివుడికి పూజా ద్రవ్యాలు అందిస్తున్నట్లు అనిపిస్తాయి.
ఏకశిలా నిర్మిత గుహాలయాలు :
వివిధ కళారీతులతో ఒకే రాతిపై చెక్కిన ఎనిమిది ఆలయాలు హిందూ ప్రాచీన, సంస్కృతి వాస్తు, శిల్పకళారీతులకు అద్దం పడుతూ బైరవకొనకు తలమాణికంగా ఉన్నా యి. మూడంతస్థుల్లో నిర్మించిన ఈ గుహలయాలు వివిధ పరిమాణాల్లో శివలింగాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. వినాయకుడు, చండేశ్వరుడు, బసవేశ్వరుడు, సూర్యుడు, చంద్రుల్ని మలచారు. ఇంకా సరస్వతి, లక్ష్మి, పార్వతి దేవి ల మూడు ముఖాలు కలిగిన త్రిమూఖ దుర్గ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. మానవుని సహజ గుణమైన సత్య, రజో, తమో గుణాలకు దుర్గాదేవి మూడు ముఖాలకు ప్రతి రూపాలుగా భక్తులు భావిస్తుంటారు. దురంభ ఆలయానికి మూడడుగుల దిగువున ఏడాది పొడవున జలపాతం నుండి వచ్చే నీరు సెలయేరులా ప్రవహిస్తుంది. ఇక్కడికి అర కిలో మీటరు దూరంలో ఉన్న జలపాతం నుండి నీరు లోలోపల ప్రవహించి ఆలయం ఎదురుగా నీరు ప్రత్యక్షమై ప్రవహిస్తుంది. ఇది చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది.
మనసు దోచే.. జలపాతం :
200 మీటర్లు ఎత్తు నుంచి జాలు వారే జలపాతం బైరవ కోనకు ప్రత్యేకత. ఏడాది పొడవున కొండ శిఖరాల నుంచి పడే ఈ జలపాతం మనసుకు , మధురాను భూతులను మిగుల్చుతున్నంత పనిచేస్తుంది. ఔషధ గుణాలు కలగిన ఈ నీటిలో స్నానం చేస్తే పలు దీర్ఘ కాలిక వ్యాధులు, సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఏడాదిలో వచ్చే కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి రోజుల్లో భైరవ కోనలో భక్తులు కిటకిటలాడుతారు.
ఎలా వెళ్ళాలి :
ఒంగోలు నుండి ప్రతిరోజూ నిర్దిష్ట సమయంలో ‘భైరవకోన’ కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. ఒంగోలు నుండి భైరవకోన కోన 70 కిలోమీటర్ల దూరంలో కలదు. కొత్తపల్లి, అంబవరం గ్రామాల నుండి కూడా భైరవకోనకు ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ జీపులు, ఆటోలు దొరుకుతాయి.