ఆయన నిజాయితీ గల ఐఏఎస్ అధికారి, 40 లక్షల జీతం……కానీ రోజుకు 8 నిమిషాలే పని !

ఆయన నిజాయితీ గల ఐఏఎస్ అధికారి, రూ.40 లక్షల జీతం……కానీ రోజుకు 8 నిమిషాలే పని !
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- అశోక్ ఖేమ్కా.. హర్యానా కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి గురించి వినే ఉంటారు. 56 బదిలీలతో అతి ఎక్కువ సార్లు బదిలీ అయిన సివిల్స్ అధికారిగా గుర్తింపు పొందారు. వాస్తవానికి ఈయన బదిలీలతోనే తరుచూ వార్తల్లో ఉంటుంటారు. నిజాయితీకి మారుపేరని ప్రశంసలు అందుకునే ఈ అధికారి.. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. తాను రోజులో కేవలం 8 నిమిషాలు మాత్రమే పని చేస్తున్నానని, అందుకు గాను ఏడాదికి 40 లక్షల రూపాయల జీతాన్ని తీసుకుంటున్నట్లు ఖేమ్కా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే హర్యానా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు చెందిన ఆర్కీవ్స్ శాఖకు బదిలీ అయ్యారు. అయితే తనను ఎక్కువ సార్లు పనిలేని శాఖల్లో నియమించారని ఆయన తరుచూ అంటూనే ఉంటారు. అయితే తనను అవినీతిని నిర్మూలించే స్టేట్
విజిలెన్స్ విభాగానికి అధిపతిగా నియమించాలని తాజాగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘‘నన్ను జనవరి 9న ఆర్కైవ్స్ శాఖకు బదిలీ చేశారు. ఈ విభాగం వార్షిక బడ్జెట్ కేవలం 4 కోట్ల రూపాయలు. రాష్ట్ర బడ్జెట్ లో అది 0.0025 శాతం కంటే తక్కువ. అదనపు ప్రధాన కార్యదర్శిగా నాకు సంవత్సరానికి అందుతున్న జీతం 40 లక్షల రూపాయలు. ఆర్కైవ్స్ శాఖలో అది 10 శాతం. ఈ శాఖలో వారానికి ఒక గంటకు మించి పని దొరకడం లేదు. కొందరికేమో విపరీతంగా పనులు ఉన్నాయి. ఇలా కొందరికి పనులు ఎక్కువై, మరికొందరికి అసలే పని లేకపోవడం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరడం లేదు. అవినీతిని చూసినప్పుడు నా మనసు ఎంతగానో తల్లడిల్లుతుంది. దాన్ని అంతమొందించేందుకే నన్ను స్టేట్ విజిలెన్స్ విభాగానికి అధిపతిగా నియమించాలని కోరుతున్నాను’’ అని ఆ లేఖలో ఖేమ్కా పేర్కొన్నారు.