Telangana

సంక్షేమం మీ కండ్లముందు

దెబ్బతగలని చేతికి దొంగకట్టు కట్టుకొని గోబెల్స్‌ని మించి మైకులను ఊదరగొట్టిన నేత ఒకరు. దశాబ్దాల తరబడి ప్రజలతో మమేకమై.. తామేం చేశామో.. ఏం చేయబోతున్నామో చెప్తూ నియతి తప్పకుండా ముందుకు సాగిన నాయకుడు ఇంకొకరు. బీజేపీ నేతల ఇండ్లల్లో డబ్బులు పట్టుబడితే పోలీసులపైనే ఉల్టా దాడిచేసి.. డబ్బులు ఎత్తుకుపోయి, నిరాహార దీక్షకు దిగి 24 గంటల్లోనే విరమించుకొన్న నాయకుడు ఇంకొకరు. ప్రజలకోసం.. ప్రజల మధ్య రేయింబవళ్లు తిరుగుతూ.. వారి ఆదరాభిమానాలు పొందింది మరొకరు. అడ్డగోలుగా డబ్బులు పంచుతూ.. అడ్డదిడ్డంగా అబద్ధాలాడుతూ.. నోటికొచ్చినట్టుగా మాట్లాడిన బీజేపీ నేతలు రోజుకోరీతిన రాజకీయ నాటకాన్ని రక్తి కట్టించారు. ఈ నాటకాలెలా ఉన్నా.. గులాబీ గుభాళించడం ఖాయమని, టీఆర్‌ఎస్‌ ధూంధాం తథ్యమని చివరి రోజు సైతం దుబ్బాక ప్రజలు చాటి చెప్పారు. సత్యాసత్యాల మధ్య సమరంలో దుబ్బాక ఓటరు తన తీర్పును నిక్షిప్తం చేసేది రేపే.

హైదరాబాద్‌/ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 9న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం పోలింగ్‌ జరగనున్నది. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీతో పాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘నోటా’తో కలుపుకొని మొత్తం 24 గుర్తులుంటాయి. రేపు పోలింగ్‌ నిర్వహించి, ఈ నెల 10న సిద్దిపేట ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ చేపడుతారు. 

ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు ఈ ఎన్నికల బందోబస్తు విధుల్లో నాలుగు కంపెనీల సాయుధ బలగాలను రంగంలోకి దించినట్టు శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌ తెలిపారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ నేతృత్వంలో నలుగురు అదనపు ఎస్పీలు, పది మంది డీఎస్పీలు, సీఐలు 22 మంది, ఎస్సై లు 45 మందితోపాటు 2వేల మంది వరకు పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 89 సమస్యాత్మక, 33 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు వాటి వద్ద మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

స్వస్థలాలకు నేతలు

ఉప ఎన్నిక ప్రచారానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. 20 రోజులుగా దుబ్బాకలో ప్రచార హోరు కొనసాగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీ తానై విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు కడిగి పారేశారు. ఒక దశలో రాజీనామాల వరకు సవాళ్లు వెళ్లాయి. మంత్రి విసిరిన సవాల్‌కు బీజేపీ నాయకులు తోక ముడిచారు. ఇక ప్రతి పక్ష పార్టీలు పరాయి లీడర్లు .. కిరాయి మనుషులు అన్నట్లుగా ప్రచారం సాగించాయి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ జోష్‌ మీద ఉంది. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో గత 20-25 రోజులుగా పల్లెల్లో గులాబీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించాయి.

మహిళా ఓటర్లే అధికం

దుబ్బాక నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 1,98,756 ఓటర్లు ఉండగా ఇందులో 1,00,778 మంది మహిళలు, 97,978 మంది పురుషులు ఉన్నారు. 315 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 148 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉన్నాయి.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: