Andhra PradeshNellore
వందేళ్లు అయినా చెక్కుచెదరని నెల్లూరు కలెక్టర్ కార్యాలయం – ఇప్పటి ఇంజనీర్లకు సవాల్ ఈ అద్భుత కట్టడం !

వందేళ్లు అయినా చెక్కుచెదరని నెల్లూరు కలెక్టర్ కార్యాలయం – ఇప్పటి ఇంజనీర్లకు సవాల్ ఈ అద్భుత కట్టడం !
క్యాపిటల్ వాయిస్, నెల్లూరు :- చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే కట్టడాలలో.. వందల ఏళ్ళ క్రితం నిర్మించినా.. నేటికీ చెక్కు చెదరకుండా ఉండేవి కొన్ని ఉంటాయి. నేటి ఇంజనీర్లకు సవాళ్లను విసురుతున్న కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కట్టడాల్లో ఒకటి నెల్లూరు జిల్లాలోని కలెక్టట్ కార్యాలయం. బ్రిటీష్ కాలం నాటి ఈ కట్టడం ఇప్పటికీ స్థిరంగా, ధృడంగా ఉండడం చూస్తే.. అప్పటి కట్టడాల్లో ఎంతటి నైపుణ్యం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చరిత్రకు ఆనవాలుగా, భావితరాలకు స్ఫూర్తిగా నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం నెలకొంది. నెల్లూరు జిల్లా 1953 అక్టోబర్ 1 వరకు మద్రాసు రాష్ట్రం సంయుక్త రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది. నవంబరు 1, 1956 న రాష్ట్రాలు ఒక భాషా పద్ధతిలో పునర్ వ్యవస్థీకరించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. కాలక్రమేణా నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు.నెల్లూరు జిల్లాకు ఘనచరిత్రే ఉంది. దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు, మతసామరస్యంగా ఉండే దర్గాలకు నెల్లూరు జిల్లా నెలవు. ఇక ఇక్కడి కట్టడాలు కూడా ఎంతో అపురూపమైనవి. చరత్రకు దర్పణంగా ఎన్నో నిర్మాణాలున్నాయి. అందులో ఒకటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం.వందేళ్ళ క్రితం బ్రిటీష్ పాలనలో నెల్లూరు పట్టణ నడిబొడ్డున కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించారు. సువిశాలమైన ప్రదేశంలో ఎంతో నాణ్యతతో, మన్నికతో దీన్ని కట్టారు. రంగూన్ టేకుతో, ఎర్రని రంగుతో నిర్మించిన ఈ భవనం ఎంతో హుందాగా చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. పెద్ద పెద్ద దర్వాజాలు, కిటికీలు, బెంచ్‌లు, ఇలా ఒకటేమిటి.. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే ఈ బిల్డింగ్‌ని అద్భుతంగా నిర్మించారు. కలెక్టర్ కార్యాలయంలో పై అంతస్తులోకి వెళ్ళేందుకు అప్పట్లో చెక్క మెట్లను నిర్మించారు. వందేళ్ళ క్రితం వాడిన చెక్క మెట్లే ఇప్పుడు కూడా వాడకంలో ఉన్నాయంటే.. వీటి నాణ్యత ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.బ్రిటీష్ దొరలు పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించారు. అలా నిర్మించిన వాటిలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఒకటి. నెల్లూరు జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన తొలి బ్రిటీష్ వ్యక్తి జెజె కాటన్. 1906, 1907 కాలంలో ఆయన జిల్లాకు కలెక్టరుగా భాద్యతలు నిర్వర్తించారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించే వరకు బ్రిటీష్ పాలకులే కలెక్టరుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత స్వదేశీయులు కలెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. వందేళ్ళ క్రితం కట్టిన ఈ కలెక్టర్ కార్యాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఒకటీ అర పగుళ్ళు తప్పితే.. కట్టడంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదంటే ఆశ్చర్యం కలుగకమానదు. బ్రిటీష్ హయాం నాటి చరిత్రకు ఆనవాలుగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం నేటికీ చెక్కుచెదకుండా నిలిచి వీక్షకులను అబ్బురపరుస్తుంది.ఎంతో విశిష్టత ఉన్న కట్టడాల్లో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ కట్టడాలను చూసినప్పుడు నేటి తరం ప్రజలు ఇంతటి ఘన చరిత్ర మన నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి ఉందా అంటూ చర్చించుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్రకు సజీవ సాక్ష్యం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం కేవీఎన్ చక్రధర్ కలెక్టర్‌గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.(ఓ మిత్రుని సౌజన్యం తో)