రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి..!టిడిపి భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు డిమాండ్

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి..!టిడిపి భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు డిమాండ్
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
సేవ్ ఇండియా – మోడీ హఠావో నినాదంతో దేశ వ్యాప్తంగా ఉన్న 500 పైగా రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సూచనలు మేరకు భీమిలి పెద్ద బజార్, చిన్న బజార్ జంక్షన్ లో తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు సమక్షంలో వామపక్ష నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ లో పాల్గొని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మద్యం దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయించడమైనది.
ఈ సందర్భంగా కోరాడ రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలు అన్ని వర్గాల అన్నదాతలను మోసం చేసేవిధంగా ఉన్నాయని, దేశ వ్యాప్తంగా ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని అన్నారు. న్యాయమైన రైతుల సమస్యలకు పరిష్కారం చూపవలసిన ప్రభుత్వాలు తిరిగి రైతులను అరెస్టులు చేసి , లాఠీ చార్జీలు చేసిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని అలాంటి రైతులకు అండగా ఉండవలసిన ప్రభుత్వాలు రైతులపట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని కోరాడ రాజబాబు దుయ్యబట్టారు. కార్పొరేట్ సంస్థల ముసుగులో ప్రధానమంత్రి అన్నదాతలను నిలువునా ముంచారని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు మాట్లాడుతూ పోర్టులను ప్రైవేటీకరణ చేయడం వలన స్మగ్లింగ్ ఎక్కువై దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఆర్ధిక నేరస్తులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం మొండిగా ఆలోచిస్తుందని అన్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పట్ల దేశ వ్యాప్తంగా రైతులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని అన్నారు. సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు ఆర్.ఎస్.ఎన్.మూర్తి మాట్లాడుతూ దేశం సస్యశ్యామలమైనదిగా ఉందంటే దానికి కారణం రైతులేనని అన్నారు. అలాంటి రైతులు కష్టపడి పండించే పంటకు గిట్టుబాటు ధరను నిర్ణయించుకొనే అవకాశం లేకుండా అంతా కార్పొరేట్ రంగాల చేతులో దేశం ఉండేవిధంగా నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే చమురు ధరలు అయిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, కొత్తగా తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కారణంగా అన్నదాతలు కుదెలయ్యే ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి రైతులకు మేలు చేసేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, మారోజు సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు, కొక్కిరి అప్పన్న, సంకురుభుక్త జోగారావు, అప్పికొండ నూకరాజు, గండిబోయిన పోలిరాజు, సి.ఐ.టి.యు. భీమిలీ మండల అధ్యక్షులు ఎస్.అప్పలనాయుడు, సి.పి.ఐ.జిల్లా సమితి సభ్యులు దుంప శ్రీను, జే.రాజు, ఏ.పోలయ్య, టిడిపి నాయకులు సత్తరపు చిన్న, వాసుపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.