Andhra PradeshPolitics

తేలని రోగం..!

ఏలూరును కుదిపేస్తున్న అంతుచిక్కని వ్యాధి
రాత్రి తొమ్మిది గంటల సమయానికి 300కు చేరిన బాధితులు.. ఒకరు మృతి, 117 మంది డిశార్జి
అత్యవసర వైద్యం కోసం విజయవాడకు ఏడుగురు
గదుల్లేక ఆసుపత్రి వరండాలోనే బెడ్లు
నీటికాలుష్యం లేదన్న మంత్రి ఆళ్లనాని
బాధితులకు విపక్ష నాయకులు పరామర్శ
నేడు సిఎం ఏలూరు రాక

మోటార్‌ బైక్‌పై వెళుతూ.. పడిపోతున్నారు. నడుస్తూ..నడుస్తూనే కుప్పకూలిపోతున్నారు. మూర్ఛతో కొట్టుకుంటున్నారు. నోటివెంట నురగలు కక్కుతున్నారు. ఇది గత రెండు రోజులుగా ఏలూరులోని వింతపరిస్థితి. ఇలాంటి లక్షణాలతో వందల సంఖ్యలో జనం అనారోగ్యం పాలై ఆసుపత్రికి చేరుతున్నా సమస్య ఏమిటో ఏ ఒక్కరూ చెప్పని పరిస్థితి నెలకొంది. ఒకరు మృతి చెందడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంకా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఏలూరు ప్రజానీకం గందరగోళానికి గురవుతోంది. ఏలూరు పట్టణంతో పాటు, శనివారపుపేట, తంగెళ్లమూడి వంటి చుట్టుపక్కల గ్రామాల్లో సైతం అనారోగ్యంపాలై ఆసుపత్రికి చేరుతున్న వారి సంఖ్య ఆగడంలేదు. దీంతో రాత్రీ, పగలు వైద్య సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఏలూరు పట్టణంలోనూ, శనివారపుపేట, తంగెళ్లమూడి వంటి ప్రాంతాల్లో మూర్ఛ లక్షణాలు, వాంతులు, కళ్లుతిరిగి కిందపడిపోయి అస్వస్థతకు గురౌతున్న రోగుల సంఖ్య ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి 300కు చేరింది. వీరిలో ఒకరు మృతిచెందడం జిల్లాలో సంచలనం రేపుతోంది. విద్యానగర్‌కు చెందిన మైనేని శ్రీధర్‌(45) ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చేరారు. సాయంత్రానికి పరిస్థితి విషమించి మృతిచెందారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 118 మంది పురుషులు, 92 మంది మహిళలు, 90 మంది పిల్లలున్నారు. 117 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మరో 30 మంది డిశ్ఛార్జికి సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆర్‌ఎంపి, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్తున్న రోగులపై స్పష్టత లేదు. ఈ సంఖ్య సైతం వందల్లోనే ఉన్నట్లు సమాచారం. మూడురోజుల క్రింతం ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లో వాంతులు, మూర్ఛ లక్షణాలతో కళ్లుతిరిగి నలుగురు రోగులు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. సాధారణ సమస్యగా భావించి వైద్యం చేసి పంపించారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఈ సంఖ్య ఏకంగా వందల్లోకి చేరింది. దీంతో అధికారులు, వైద్యశాఖ అప్రమత్తమై వైద్యం అందిస్తున్నా.. అనారోగ్య సమస్య ఎందుకు వస్తుందో మాత్రం ఇప్పటికీ నిర్ధారించలేకపోయారు. ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలో ఈ విధమైన పరిస్థితి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్కానింగ్‌, రక్త, వైరాలజీ పరీక్షల్లో ఎలాంటి సమస్యా లేనట్లు వైద్యులు చెబుతున్నారు. కల్చర్‌ టెస్టుకు(వెన్నెముక నుంచి తీసే నమూనా) సంబంధించిన రిపోర్టు వచ్చిన తర్వాత గానీ సమస్య ఏమిటో చెప్పలేమని చెబుతున్నారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక వాలంటీరు సైతం ఉన్నారు. ఏలూరులో 15 ఆంబులెన్సులు రోగులను చేరవేస్తున్నాయి. పలువురు ఆటోలలో ఆసుపత్రికి చేరుతున్నారు. ఊహించని విధంగా ఒక్కసారిగా కిందపడిపోవడంతో తలకు, కాళ్లకు గాయాలతో బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. చాలామంది బాధితులు పడిపోయిన తర్వాత ఏం జరిగిందో కూడా తెలియడం లేదని చెబుతున్నారు. శనివారం పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండగా, ఆదివారం పెద్దవాళ్లు, యుక్తవయస్సువారు ఉన్నారు. అనారోగ్యానికి గురైనవారిలో వాలంటీర్లు సైతం ఉన్నారు. ఆరోగ్యబృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి. శనివారం మధ్యాహ్నం నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది నిద్రాహారాలు వదిలి వైద్యసేవలు అందిస్తున్నారు. కలెక్టర్‌ ముత్యాలరాజు, జెసి హిమాన్షుశుక్లా, డిఎంహెచ్‌ఒ సునంద, ఆర్‌డిఒ రచన, సూపరింటెండెంట్‌ ఎవిఆర్‌.మోహన్‌ ఆసుపత్రిలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి ఎప్పటికీ సాధారణ స్థితికి చేరుతుందో ఏ ఒక్కరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది ఏలూరు ప్రభుత్వాసుపత్రితోపాటు, ఆశ్రంలోనూ బెడ్లు ఏర్పాటు చేశారు. బాధితులు పెరిగితే ప్రయివేటు ఆసుపత్రులకు తరలించే ఆలోచన చేస్తున్నారు. బాధితులు నిరంతరాయంగా వస్తుండటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి కిక్కిరిసిపోతుంది. బాధితుల బంధువులు మనోవేదనకు గురవుతున్నారు. గదులు ఖాళీలేక ఆసుపత్రి వరండాలోనే బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రత్యేక వైద్యనిపుణులు ఇక్కడకు చేరుకున్నారు. అయితే ఏ ఒక్కరూ ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. టిడిపి నేత నారాలోకేష్‌, బిజెపి నాయకులు సోమువీర్రాజు, కాంగ్రెస్‌ నాయకులు జట్టిగురునాథరావు, జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు, సిపిఎం నాయకులు ఆదివారం ఆసుపత్రిలో చేరిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు లోకేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఏలూరు నగరం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. బాధితులను ఎలా ఆదుకోవాలో ఆలోచించకుండా.. ఏమీ జరగలేదని మభ్యపెడుతున్నారన్నారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలో ఈవిధంగా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నారు. ప్రతివ్యక్తీ కోలుకునే వరకూ ప్రభుత్వమే వైద్యం చేయించాలన్నారు.

నేడు ఏలూరుకు సిఎం

ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం ఏలూరు వస్తున్నారు. గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు కుమార్తె రిసెప్షన్‌ వేడుకకు సిఎం పరట్యన ఈ నెల ఏడో తేదీన ఖరారైంది. పర్యటనలో మార్పులు చేయడంతో ఏలూరుకు కూడా సిఎం పర్యటన ఖరారు చేశారు. ఉదయం పది గంటలకు ఏలూరులోని సిఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద సిఎం దిగుతారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి మాట్లాడతారు. అనంతరం జిల్లా పరిషత్‌ గెస్ట్‌ హౌస్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి 11.55కు హెలికాప్టర్‌లో దేవరల్లి చేరుకుని వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు.

నీటి కలుషితం కాదు : ఆళ్లనాని, ఆరోగ్యశాఖ మంత్రి
ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని సొంత నియోజకవర్గం కావడంతో.. ఆయన ఉదయం, సాయంత్రం ఆసుపత్రికి వచ్చి పరిశీలన చేస్తున్నారు. వైద్యులతో, అధికారులతో మాట్లాడారు. తాగునీటికి సంబంధించి 22 శాంపిల్స్‌ తీసి పరిశీలించినట్లు చెప్పారు. తాగునీరు కలుషితం కాలేదని తేలిందన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. బాధితుల్లో అత్యధిక మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారన్నారు. కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశామని, బాధితుల సంఖ్య పెరిగినా అందుకు తగినట్లుగా బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదారాబాద్‌ నుంచి సోమవారం శాస్త్రవేత్తలు వస్తున్నారన్నారు. బాధితులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: