తీరంలో రక్షణగోడ నిర్మించి – మత్స్యకారుల గ్రామాలకు రక్షణ కల్పించండి..!
ప్రభుత్వానికి మత్స్యకారుల నాయకుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విజ్ఞప్తి

తీరంలో రక్షణగోడ నిర్మించి – మత్స్యకారుల గ్రామాలకు రక్షణ కల్పించండి..!
ప్రభుత్వానికి మత్స్యకారుల నాయకుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విజ్ఞప్తి
గత 20 సంవత్సరాలుగా భీమిలి తీరం కోతకు గురై మత్స్యకారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుందని, తీరం వెంబడి రక్షణ గోడ నిర్మించాలని ఎప్పటినుండో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వానికి మత్స్యకారుల గోడు పట్టడం లేదని మత్స్యకారుల నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు.భీమిలి తీరంలో ఉన్న బోయవీధి గ్రామానికి, నోవేటల్ కి మధ్యలో సముద్ర కోతకు గురైన తీరాన్ని స్థానిక మత్స్యకారులతో కలసి పరిశీలించడమైనది. ఈ సందర్భంగా గంటా నూకరాజు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం ఈ తీరంలో మత్స్యకారులు పడవలు, వలలు ఒడ్డున పెట్టుకొని వేట సాగించేవారని అన్నారు. కానీ నేడు ఆనాటి తీరం కనబడకుండా మొత్తం సముద్రంచే నిండిపోయి ఉందని అన్నారు. సముద్రం సాధారణ కెరటాలకే నీరు రోడ్డుమీదకు వస్తుందని , ఇలాంటి సమయంలో మత్స్యకారులు ఎంతో ఉగ్వేదానికి గురవుతున్నారని గంటా నూకరాజు చెప్పారు. సముద్రం కోతకు గురి కాకుండా తీరం వెంబడి రక్షణ గోడ ముంబాయి తరహాలో నిర్మించాలని గత ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలకు విన్నవించుకున్నా స్పందన లేదని వాపోయారు. రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టె మత్స్య సంపదకు కారకులైన మత్స్యకారులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని గంటా నూకరాజు ప్రశ్నించారు. తీరంలో రక్షణ గోడ నిర్మించడంలో ప్రతీ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. గత ప్రభుత్వం భీమిలి తీరంలో రక్షణ గోడ నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసిందని, ప్రభుత్వం మారిన తరువాత నాటి ప్రతిపాదనలకు సంబంధించిన ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో అర్ధం కావడం లేదని అన్నారు. అధికారులు తీరం వెంబడి నిత్యం ప్రయాణం చేస్తుంటారని ఏ అధికారికి కూడా ఇక్కడ సముద్రం కోతకు గురవడం కనబడలేదా..? అని అడిగారు. తీరంలో రక్షణ గోడ నిర్మాణంలో ప్రభుత్వాలు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయో అర్ధం కావడం లేదని అన్నారు. దయచేసి స్థానిక మత్స్యకారుల తరపున రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను, తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు బయటకు తీసి రూపకల్పన చేయాలని, స్థానిక మత్స్యకారులకు, మత్స్యకారుల గ్రామాలకు రక్షణ కల్పించాలని మంత్రిగారు, కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులు కలుగ చేసుకొని రూపకల్పన చేయాలని గంటా నూకరాజు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకారుల నాయకులు కాసరపు నాగరాజు, బోయవీధి మాజీ సొసైటీ ప్రెసిడెంట్ కాసరపు నర్సింగరావు, కాసరపు ఎల్లాజి, కొక్కిరి అప్పన్న, జాలారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొక్కిరి నూకరాజు, తెడ్డు సింహాద్రి, వాడమొదలు లక్ష్మయ్య, దౌలపల్లి హరీష్, మట్టా దాసు, కొక్కిరి అప్పన్న, కదిరి ఎల్లయ్య, వాడమొదలు చిన్న ఆదెప్ప, వాడమొదలు తవుడయ్య, నొల్లి ఎల్లాజి, కొక్కిరి బాలరాజు, కాసరపు ఎల్లాజి, కాసరపు సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.