జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి నేతన్న నేస్తం : కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి నేతన్న నేస్తం : కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- ప్రయోజనం దక్కేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ లో నేతన్న నేస్తం లబ్ధిదారుల ఎంపిక పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు నేతన్న నేస్తం పథకం కింద 24 వేల రూపాయలు ఆర్థిక సహాయం పొందుట కోసం 6060మంది నేతన్నలు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారిలో పాత వారు 5240 మంది కాగా, కొత్త వారు 820 మంది ఉన్నారన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు నిశితంగా పరిశీలించడం జరుగుతోందన్నారు. అందులో ఇప్పటివరకు 421 దరఖాస్తులు వివిధ కారణాల చేత అర్హత లేనివిగా గుర్తించడం జరిగిందన్నారు.
సొంతంగా మగ్గం తప్పనిసరిగా కలిగి ఉండి నేతనేస్తుండేవారు నిజంగా పథకం పొందుటకు అర్హులని స్పష్టం చేశారు. అర్హతలేని దరఖాస్తులను తిరస్కరించే ముందుగా మరలా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా క్షేత్రస్థాయిలో మరోసారి క్షుణ్ణంగా పరిశీలన జరపాలన్నారు.ఇందుకోసం ఎంపీడీవో , మున్సిపల్ కమిషనర్లు, చేనేత అధికారులు, గ్రామ,వార్డు వాలంటీర్లతో బృందాలను ఏర్పాటు చేసి వారంలోగా తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తద్వారా వాస్తవ నివేదికను సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఒక్కరి డేటా వివరాలను పక్కాగా రూపొందించాలన్నారు. భవిష్యత్తులో ఎవరైనా స్పందన లో గాని ఇతరత్రా గాని అర్హత ఉండి నేతన్న నేస్తం ప్రయోజనం రాలేదనే ప్రస్తావన వస్తే వాస్తవ నివేదికను సరి చూసుకో వచ్చన్నారు. ఈ సమావేశంలో అభివృద్ధి సంయుక్త కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీ ఆనంద్ కుమార్, జడ్పీ సీఈవో శ్రీమతి సుశీల, ఏ డి ఓ లు ప్రసాదరావు,వెంకటరావు, శరజిని కుమారి, డి వో లు వెంకటేశ్వర్లు,విజయబాబు పాల్గొన్నారు.