కేబినెట్ బెర్త్ కోసం సీమ నేతల రేస్… సీఎం జగన్ వారిపైనే దృష్టిపెట్టారా..?

కేబినెట్ బెర్త్ కోసం సీమ నేతల రేస్… సీఎం జగన్ వారిపైనే దృష్టిపెట్టారా..?
క్యాపిటల్ వాయిస్, అమరావతి :-
పార్టీలోని ముఖ్యనేతలంతా ఎవరికి వారు మంత్రిపదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఐతే సీఎం వైఎస్ జగన్ మనసులో ఏముందో అనేదానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.రాయలసీమలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం మంత్రివర్గంలో మార్పులకు త్వరలో ముహూర్తం పెట్టనున్నట్లు తెలియడంతో ఆశావాహులంతా సీఎం జగన్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ఎమ్మెల్యేలు. నిన్న రాష్ట్ర రైతుల దినోత్సవాన్ని అనంతలో భారీగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని నెలల అనంతరం జరుగుతున్న భారీ బహిరంగ సభ కావడంతో సీఎం జగన్ కంట్లో పడేందుకు అనంత, కర్నూలు జిల్లాలకు సంబంధించిన పలువురు నేతలు సభ అనంతరం ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం తమ జిల్లాలో ఉన్న మంత్రులపై విమర్శలు చేస్తూనే తమకు పదవులు ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని పార్టీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్యాబినెట్ లో బెర్త్ దక్కించులేకపోతే ఇక మంత్రి అయ్యే ఛాన్స్ లేకపోవడంతో గట్టిగానే తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమకు మాట ఇచ్చారంటూ కొందరు ఒత్తిడి చేస్తుంటే., మరి కొందరు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి పట్టగట్టాలని కోరుతున్నట్లు వినికిడి.
కర్నూలు నుంచి ముగ్గురు నేతలు తీవ్రంగా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారని జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం ప్రస్తుత మంత్రులుగా జిల్లా నుంచి ఉన్నారు. వీరిలో ఎవరిని తప్పిస్తారో, ఎవరిని ఉంచుతారో తెలియాదు కానీ జిల్లాలోని సీనియర్ నేతలు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారి ఆశకు వేరే కారణంకూడా ఉందని అంటున్నారు కర్నూలు వాసులు. బుగ్గన మంత్రి పదవిని వదులుకోవాలని చూస్తున్నారని, లేదా పోర్టుఫోలియో మార్చాలని సీఎం కు విజ్ఞప్తి చేసినట్లు జిల్లాలో గుసగుసలు వినిపిస్తిన్నయి. కర్నూలు నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా ఎంపికైన రాంభూపాల్ రెడ్డి ఈసారైనా మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో కాటసాని మంత్రి పదవిని ఆశించారు. అప్పట్లో వైఎస్సార్ కు అత్యంత సన్నిహితులు కావడంతో నేను ఉన్న కదా..! నీకు మంత్రి పదవి ఎందుకు అని అన్నారట. దీంతో రాంభూపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు వదిలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మినిస్టర్ హోదా రాలేదనే బాధ ఆయనలో ఉండిపోయింది. తనకు ఉన్న సీనియారిటీని జగన్ గుర్తించి మంత్రి పదవి ఇస్తారని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ సీఎం జగన్ ను పలుమార్లు కలసి కోరినట్లు టాక్.ఇక ఆదోని ఎమ్మెల్యే సాయిప్రతాప్ రెడ్డి సైతం మినిస్టర్ పదవి కోసం పావులు కదుపుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే కావడం.., తన ఇద్దరు తమ్ములు బాలనాగిరెడ్డి మంత్రాలయంకు, వెంకట్రామిరెడ్డి గుంతకల్లుకు ఎమెల్యేలుగా ఉన్నారు. తమ కుటుంబంలో సాయిప్రతాప్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సోదరులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో తమను నమ్ముకున్న వారి ఆశ కూడా అదేనని పార్టీ అధిష్టానంతో పాటుగా పలువురు పార్టీ ముఖ్య నేతలను కలసినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ బెర్త్ రేసులో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. నాడు మంత్రివర్గంలో చోటు కోసం వైసీపీ ముఖ్యులతో తీవ్రంగా ప్రయత్నించారట. అప్పట్లో నంద్యాల ఉపఎన్నిక సమయంలో వైసీపీలో చేరేందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు చక్రపాణి రెడ్డి. టీడీపీ మండలి ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినా వదలుకున్నానని చెబుతూ.. వైఎస్ కుటుంబంలో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తున్నారట. చక్రపాణి సైతం ఈ దఫా తప్పకుండా మంత్రి అవుతాననే గట్టి నమ్మకంతో ఉన్నారట.ఇక అనంతలో రాజకీయం హై పిచ్ లో కొనసాగుతోంది. గత మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి ఒకరికి మాత్రమే చోటు దక్కింది. ఈ సారి ఇద్దరికీ మంత్రి పదవి వరించనుందని టాక్ వినపడుతోంది. అనంత నుంచి ముందు వరుసలో నలుగురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్న కాపు రామచంద్రారెడ్డి ఏడాదిగా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేపట్టారట. వైఎస్ హయాంలో కాంగ్రెస్ లో చేరిన కాపు రామచంద్రా రెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ వద్ద మంచి గుర్తింపు ఉన్న నేతగా కాపు రామచంద్రారెడ్డికి పేరుంది. వైఎస్ కుటుంబంపై అత్యంత సన్నిహితులైన గాలి జనార్దన్ అండ కూడా ఆయనకు పుష్కలంగా ఉండటంతో మంత్రి పదవి ఖాయమని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి.రాజకీయ కుటుంబం నేపధ్యం నుంచి వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రెండు సార్లు గెలుపొందారు. తమ కుటుంబం నుంచి తన బాబాయ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ పై గెలుపొందడంతో మంత్రి పదవి వస్తుందంటూ కొండంత ఆశతో ఉన్నారట. మొదటి సరి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి వైఎస్ ఎంతగానో కృషి చేశారని.., వైఎస్ పై విధేయత, పార్టీపై పట్టు ఉన్న నేతనైన తనకు క్యాబినెట్ అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారట. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంటకట్రామి రెడ్డి కూడా అమాత్యయోగం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. సీఎంతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే స్థాయి ఆయనకి ఉంది. అయన నియోజకవర్గంలోనే ప్రత్యర్థి లేకుండా చేసుకున్న వ్యూహాత్మక నేతగా ఉన్నారు. దీంతో ఆయనకి క్యాబినెట్ లో బెర్త్ ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వియంకుల కుటుంబ సభ్యులు కర్నూలు, అనంత జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో వారి సహకారం కూడా ఉంటుందని చెపుతున్నారు అనుచరులు.
అనంతలో బలమైమ వర్గంగా పేరొందిన పరిటాల ఫ్యామిలీపై దశాబ్దాల పాటు పోరు సాగించారు వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పరిటాల కుటుంబంపై పలుమార్లు పోటీ చేసి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న రాప్తాడులో వైసీపీ జండా ఎగుర వేసాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రత్యర్థులపై పోరుకి మాత్రం వెనకాడకపోవడంతో తామే మంత్రి పదవి వరించనుందని సన్నిహితులతో చెప్పుకున్నారట.
ఇక అనంత నుంచి మహిళా ఎస్సి కోటాలో జొన్నగలగడ్డ పద్మావతి మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి సీఎం జగన్ కు నమ్మిన బంటులా, అయన కనుసన్నల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆమె మంచి విద్యావంతురాలు కావడం విశేషం. సింగనమల ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతి సీఎం జగన్ ను మహేష్ బాబు డైలాగ్ తో పొగిడేస్తున్నారు. పాఠశాల, ఉన్నత విద్య శాఖ చైర్మన్ గా ఉన్న ఆమె భర్త ఎస్సి కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. ప్రస్తుత ఏపీ పంచాయితీ రాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో పార్టీ గెలుపుకోసం ఎంతో కృషి చేసారన్న పార్టీలో పేరుంది. రాష్ట్రంలోనే బలమైన రాజకీయ నాయకుడుగా ఎదిగిన పెద్దిరెడ్డి మంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు. తనను కాదని వెళ్లే ఎమ్మెల్యేలు లేకపోవడంతో పెద్దిరెడ్డి బెర్త్ ఖాయం. ఇక డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి కొనసాగుతున్నారు. అయితే మంత్రి పదవి కోసం ఆ ముగ్గురు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తొలివిడదలతో ఛాన్స్ రాకపోవడంతో ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఎదుటి వారు ఎంతవారైనా సరే దీటుగా విమర్శలు చేసే రోజా నియోజకవర్గ అభివృద్ధిలోను తనదైన ముద్ర వేశారు. అయితే మంత్రి అవ్వాలన్న రోజా కల ఈ క్యాబినెట్ విస్తరణలో సాకారం అవ్వడం తధ్యమనిఅంటున్నారు.
ఇక నియోజకవర్గ ప్రజలకు అన్ని తానై చేసేస్తుంటారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రజలకు తాను చేసే సేవలతో పాటుగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిపై పోరుబాట పట్టి ఘనవిజయం సాధించారు. ఇప్పటికే ఆయనకు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ గా పదవి కట్టబెట్టారు. కానీ ఈ సారి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. వైఎస్ఆర్ తో పాటుగా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడుగా చెవిరెడ్డికి పేరుంది. తిరుపతి ఎమ్మెల్యేభూమన పేరు కూడా కేబినెట్ రేసులో బలంగా వినిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి బంధువర్గమైన భూమనకు మంత్రి పదవి ఇస్తారని అనుచరులు ఆశతో ఉన్నారు. ఇదే తన చివరి ఎమ్మెల్యే ఎన్నిక అని బహిరంగంగా ప్రకటించారు భూమన. రాజకీయాల నుంచి మంత్రిగా రిటైర్మెంట్ తీసుకోవాలనిఉందని సీఎం జగన్ చెవిలో వేసారట భూమన. దీంతో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడుతున్నారట.
సీఎం సొంత జిల్లాలోనూ మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ఎదురు చూపులు ఉన్నాయని తెలుస్తుంది. జగన్ ముఖ్యమంత్రిగా, అంజద్ బాషా ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక అంజద్ బాషా సీటుపై పలువురు కడప ఎమ్మెల్యేలు కన్నేసినట్లు తెలుస్తోది. జిల్లాకు ఇద్దరు మంత్రులకే పరిమితం అయితే అంజద్ బాషా స్థానంలో మాకు మంత్రి పదవి కట్టబెట్టాలని ఆశావహులు సీఎంను కలసి విజ్ఞప్తి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ కోటాలో తనకు బెర్త్ కచ్చితంగా దొరుకుతుందని ఆశాభావంతో ఉన్నారట. కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి వైఎస్ ఛాన్స్ ఇవ్వడంతో పాటు జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయనతోనే కలసి ఉన్నారు. ఇక రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి కూడా జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. రాజంపేటలో తిరుగులేని నేతగా మేడాకు పేరుంది. పార్టీలతో సంబంధం లేకుండా నియోజవర్గ ప్రజలు మేడా కుటుంబానికి జై కొడుతుండటంతో ఆయనకి మంత్రి పదవి వరిస్తుందని అనుచరులు భావిస్తున్నారు.వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేల జాబితా మాదిరిగానే ఆశావాహుల లిస్టు కూడా చాంతాడంత ఉండటంతో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరి జగన్ ఎవరిని అందలమెక్కిస్తారో వేచి చూడాలి.