Movie

ఓటీటీపై సెన్సార్‌

న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ వంటి ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) వేదికలతోపాటు ఆన్‌లైన్‌ న్యూస్‌, కరెంట్‌ అఫైర్స్‌ పోర్టళ్లను సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. దేశంలో డిజిటల్‌ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఇప్పటివరకు ఎలాంటి చట్టం కానీ, స్వయం ప్రతిపత్తి సంస్థ్థ కానీ లేకపోవడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ సంతకంతో కూడిన నోటిఫికేషన్‌ను కేంద్రం మంగళవారం రాత్రి విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 77 ద్వారా దఖలుపడిన అధికారాలను ఉపయోగించి తాజా నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఇకపై ఓటీటీలు, న్యూస్‌ వెబ్‌సైట్లు ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి వస్తాయి. ఓటీటీలు తాము ప్రసారం చేయబోయే కంటెంట్‌కు (సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తదితరాలు) ముందుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. న్యూస్‌ వెబ్‌సైట్ల జర్నలిస్టులు, ఓటీటీల దర్శక నిర్మాతలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే తాజా ఉత్తర్వులతో ఎలాంటి నియంత్రణలు వర్తిస్తాయన్న దానిపై స్పష్టతలేదు. ఈ విషయంపై గురువారం సవివరంగా మాట్లాడుతానని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.

కంటెంట్‌లో అశ్లీలత, హింస..
ఓటీటీ వేదికలపై నియంత్రణ లేకపోవడంతో అందులో ప్రసారమవుతున్న కంటెంట్‌లో అశ్లీలత, హింస ఎక్కువగా ఉంటున్నదని పలు వర్గాలు ఆరోపిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఒక స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటుచేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్‌ శేఖర్‌ ఝా, అపూర్వ అర్హతియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నెల రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం వాటి నియంత్రణకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జనవరిలో ఎనిమిది వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ స్వీయ నియంత్రణ కోడ్‌పై సంతకాలు చేశాయి. జాతీయ చిహ్నాన్ని, పతాకాన్ని అవమానించే కంటెంట్‌నుగానీ, చైల్డ్‌ పోర్నోగ్రఫీ, ఉగ్రవాదం, మత కలహాలను ప్రోత్సహించే, రెచ్చగొట్టే కంటెంట్‌ను గానీ ప్రసారం చేయకూడదని అందులో నిర్ణయించాయి. అయితే ప్రభుత్వం ఈ కోడ్‌కు సమ్మతి తెలుపలేదు. డిజిటల్‌ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని అంతకుముందు మరో కేసులో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ప్రింట్‌ మీడియాను ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, న్యూస్‌ చానళ్లను న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌, ప్రకటనలను అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సినిమాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) నియంత్రిస్తున్నాయి.

ఆమోదయోగ్యం కాదు: కరణ్‌ అన్షుమన్‌
ఓటీటీ వేదికలను నియంత్రణ పరిధిలోకి తేవడాన్ని కంటెంట్‌ నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌, మీర్జాపూర్‌ వంటి వెబ్‌సిరీస్‌లకు దర్శకత్వం వహించిన కరణ్‌ అన్షుమన్‌ స్పందిస్తూ.. కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు కలిసికట్టుగా ఈ సెన్సార్‌ను అడ్డుకోవాలని కోరారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అంటే ఏమిటి?
ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) వేదికలు ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులను అందిస్తాయి. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌, జీ5, ఆహా వంటివి. సినిమాల ప్రసారానికే తొలుత పరిమితమైన ఈ వేదికలు, ఇప్పుడు సొంతంగా సినిమాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌లను నిర్మించి, నేరుగా తమ వేదికలపైనే విడుదల చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో చిన్న సినిమాలను మొదలుకొని పెద్ద సినిమాల వరకు అన్నీ ఓటీటీ వేదికలుగానే విడుదల అవుతున్నాయి. అయితే ఓటీటీలపై నియంత్రణ లేకపోవడంతో వీటిలో ప్రసారమవుతున్న కంటెంట్‌లో అశ్లీలత, హింస మరీ ఎక్కువగా ఉంటున్నదని పలు వర్గాలు విమర్శిస్తున్నాయి. వీటిని నియంత్రించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. గతేడాది మార్చినాటికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ మార్కెట్‌ విలువ రూ.500 కోట్లుగా అంచనా. 2025 నాటికి ఇది రూ.4,000 కోట్లకు చేరనుందని నివేదికలు చెబుతున్నాయి. గతేడాది చివరినాటికి మనదేశంలో 17 కోట్ల మంది ఓటీటీ యూజర్లు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: