Telangana

ఓటింగ్‌ పెంచేందుకు కృషి

హైదరాబాద్‌: ఓటింగ్‌ శాతాన్ని పెంచడం, ఎన్నికల దుష్ప్రవర్తనలు, దుర్మార్గాలు ఆపడంలో పౌరసమాజ సంఘాల పాత్ర కీలకమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి అన్నారు. ఎన్నికల సంఘం కార్యాలయంలో పలు పౌర సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ సాధారణ ఎన్నికల్లో పోలింగ్‌ పర్సంటేజీని పెంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణంగా పోలింగ్‌ స్లిప్పుల పంపిణీ సక్రమంగా లేకపోవడం అని గుర్తించామని చెప్పారు. అందుకే నవంబరు 25వ తేదీలోపు 100శాతం స్లిప్పులు పంచేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ, జోనల్‌ కమిషనర్లను ఆదేశించామని తెలిపారు.ఓటరు స్లిప్పు అందిన వారికి ఓటు ఉందన్న సమ్మకం కలుగుతుందని, పోలింగ్‌ కేంద్రం ముందుగా తెలపడం ద్వారా ఓటు వేసేందుకు ముందుకు వస్తారన్నారు.

ఓటుపై అవగాహన పెంచేందుకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ప్రకటనలు, షార్ట్‌ ఫిలింలు, ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. మురికివాడలు, క్లబ్బులు, వాకర్‌ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్‌ సొసైటీల్లో పౌర సంఘాలు ఓటరు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సెలబ్రిటీలతో ప్రచారం చేయించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, అవకతవకలు ఎమైనా ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని సూ చించారు. ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి విజయసింహారెడ్డి, పౌర సంఘాల ప్రతినిధులు పద్మనాభరెడ్డి, నాజర్‌హుస్సేన్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, ఇందిరమ్మ, బీటీ శ్రీనివాసన్‌, సయ్యద్‌ ఖలీద్‌ షా, శివకిరణ్‌, అంబిక పాల్గొన్నారు.

ఓటరు స్లిప్పుల పంపిణీ నేటితో ఆఖరు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓటరు స్లిప్పుల పంపిణీని బుధవారం పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. గతంలో పోలింగ్‌ 50 శాతం మించకపోవడానికి ఓటర్‌ స్లిప్పుల పంపిణీ సరిగా లేకపోవడమే కారణం. ప్రస్తుతం ప్రతి ఓటరుకూ స్లిప్‌ చేరేలా చూడాలని కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లను ఆదేశించింది. అలాగే.. అభ్యర్థుల, ఎన్నికల ఏజెంట్ల సంతకాలు సేకరించాలని కమిషన్‌ ఆదేశించింది. పోలింగ్‌ స్టేషన్‌లోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది.

శిక్షణకు హాజరుకాని వారికి షోకాజ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌
హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మంగళవారం నిర్వహించిన శిక్షణకు గైర్హాజరైన ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. వీరికి మరో అవకాశంగా బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వస్తున్నారని, ఎట్టి పరిస్థితిలోనూ కుదరదని చెప్పారు. ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని లోకేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

అన్ని ఏరియాల్లో ప్రచారం చేయండి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
నగరంలో ఏ ఎన్నికలు జరిగినా సగటు ఓటింగ్‌ శాతం 40-45 శాతం లోపే నమోదవుతున్నది. అసెంబ్లీ, పార్లమెంట్‌, బల్దియా ఇలా ఏ ఎన్నికలైనా ఓటింగ్‌ శాతం ఇంతకు మిం చడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు సర్కిల్‌ అధికారులకు గ్రేటర్‌ ఎన్నికల అథారిటీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛంద సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో అన్ని ఏరియాల్లో పోలింగ్‌ ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. వీధి నాటకాలు, పాటలు, రోడ్‌షోలు, సంప్రదాయ నృత్యా లు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రచారకర్తలకు మొబైల్‌ వ్యాన్‌లు సమకూర్చాలని కోరారు. ఈసారి ఎలాగైనా ఓటింగ్‌ను 50 శాతం దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: