అద్దె బకాయిలు పై వేసిన కమిటీని రద్దు చేయాలి
అద్దె బకాయిలు పై వేసిన కమిటీని రద్దు చేయాలి
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
వంద కోట్ల అద్దె బకాయిల అంశంపై కౌన్సిల్ లోనే చర్చకు పెట్టి నిర్ణయం తీసుకోవాలి.మహా విశాఖ నగర పాలక సంస్థ వాణిజ్య సముదాయాలు , షాపులు, కళ్యాణ మండపాల అద్దెలు, లీజుల వ్యవహారం భారీ కుంభకోణం గా రూపాంతరం చెందుతుంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా కుమ్మక్కు కావటంతో మహా విశాఖ నగర పాలక సంస్థ వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. దీన్నుంచి రక్షించాల్సిన మేయర్, కమీషనర్ లుఅందుకు విరుద్ధంగా, నిబంధనలను పక్కన పెట్టి ఒక కమిటీని నియమించి భారీ అవినీతి కార్యక్రమానికి వత్తాసు పలుకుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 907 షాపులు, కళ్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాల లీజుల ఖరారు, బకాయిల వసూలు , ఆశీలు వసూలు వంటివాటిపై రెండు పర్యాయాలు స్థాయీసంఘం లో చర్చించిన తర్వాత న్యాయ నిపుణుల అభిప్రాయానికి పంపించారు. లీగల్ ఒపీనియన్ ప్రకారం పై నిర్ణయం తీసుకోవాల్సిన నగరపాలక సంస్థ పెద్దలు అందుకు విరుద్ధంగా అఖిలపక్ష కమిటీ పేరిట కొత్త నాటకానికి తెర తీశారు. 1955 మున్సిపల్ చట్టం లోని సెక్షన్ 98 ప్రకారం నగర పాలక సంస్థలో విచారణకు ప్రత్యేక కమిటీని నిర్ణయించే అధికారం కౌన్సిల్ కి మాత్రమే ఉంటుంది. కౌన్సిల్లో రెండింట మూడు వంతుల మెజారిటీతో తీర్మానం చేసి విధి విధానాలను ఖరారు చేసిన తర్వాత మాత్రమే నిర్దిష్ట కార్యాచరణ తో కమిటీ ని నియమించాలి. మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్, కమిషనర్లు అందుకు విరుద్ధంగా షాపుల అద్దెలు, బకాయిలపై కమిటీని చేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఈ కమిటీకి ఎటువంటి అధికారాలు ఉండవు. ఉత్త త్తి కమిటీలతో వంద కోట్ల అదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేయటం మేయర్ , కమిషనర్లకు తగదు. ఇది ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను అవమానించడమే.
న్యాయబద్ధత, అధికారంలో లేని ఈ కమి టీ నిబంధనలకు విరుద్ధంగా పాత వారి నుంచే ముడుపులు తీసుకొని షాపులు కల్యాణమండపాలు సముదాయాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అధికార వైయస్సార్ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులు కూడా ఇందుకు సహకరిస్తున్నారు. గత పాలకవర్గం తెలుగుదేశం పార్టీ దే కావడం అందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరగడమే వారిద్దరూ ఏకం కావడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి చర్యల కారణంగా నగరపాలక సంస్థకు వంద కోట్లకు పైగా ఆదాయం కోల్పోతుంది. ఈ అంశంపై నేరుగా కౌన్సిల్ లోనే చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కౌన్సిల్ లోనే వీటి పై చర్యలు తీసుకోవాలి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లకుండా న్యాయనిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అద్దె బకాయిలను జీ ఎస్ టీ , అపరాధ రుసుములతో కలిపి వసూలు చేయాలి. పదేళ్ల క్రితం నాటి నామ మాత్ర పు అద్దెలనే కొనసాగించకుండా మార్కెట్ విలువ ప్రకారం నిబంధనల మేరకు కొత్త అద్దెలను ఖరారు చేయాలి. బకాయిలు చెల్లించని చ వారిని బ్లాక్లిస్టులో పెట్టి చర్యలు తీసుకోవాలి. బకాయి దారులపై రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించడంతో పాటు అవసరమైతే పోలీసు కేసులు కూడా నమోదు చేయాలి.
అందుకు విరుద్ధంగా కమిటీ నివేదిక పేరిట అక్రమంగా లీజుల కట్టబెట్టె అంశాన్ని 18వ తేదీ నాటికి కౌన్సిల్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా పెట్టె ప్రయత్నాలను విరమించుకోవాలి. కమిటీ సిఫార్సులపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోవటం అంటే కార్పొరేటర్ల అవమానించడమే. వంద కోట్ల రూపాయల బకాయిలు అంశాన్ని నేరుగా కౌన్సిల్ లోనే చర్చించాలి. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఈ కమిటీని రద్దు చేసి వారు ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేయాలి.